వైఎస్ వివేక హ‌త్య కేసు విచార‌ణ‌: క‌ర్ణాట‌క నుంచి 20 వాహ‌నాల్లో వ‌చ్చిన రెవెన్యూ, బ్యాంకు అధికారులు

  • కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ‌
  • సీబీఐ అధికారుల‌ను క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌
  • సీబీఐ అధికారుల‌తో క‌లిసి ప‌లు ప్రాంతాల‌కు వెళ్లిన వైనం
  • సునీల్ యాద‌వ్‌ కుటుంబ సభ్యులను కలిసిన సీబీఐ అధికారులు 
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం విచార‌ణ కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇప్ప‌టికే అనేక మంది అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు.

ఈ రోజు ఆ అతిథి గృహానికి క‌ర్ణాట‌క నుంచి 20 వాహ‌నాల్లో రెవెన్యూ, బ్యాంకు అధికారులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వారంతా సీబీఐ అధికారుల‌ను క‌లిసి ప‌లు అంశాల‌ను వివ‌రించారు. ఆ త‌ర్వాత సీబీఐ అధికారుల‌తో క‌లిసి ప‌లు ప్రాంతాల‌కు వెళ్లారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఈ కేసులో ఇప్ప‌టికే క‌డ‌ప ఎస్‌బీఐకి చెందిన ముగ్గురు అధికారుల‌ను సీబీఐ విచారించింది. మ‌రోవైపు, క‌డ‌ప‌లో సీబీఐ అధికారుల‌ను వివేక కూతురు, అల్లుడు క‌లిశారు. అనంత‌రం కొంద‌రు అధికారులు వివేక హ‌త్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఇంటికి వెళ్లి అత‌డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు.  

ఈ కేసులో సునీల్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు ఇటీవ‌ల‌ గోవాలో అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో సీబీఐ అధికారుల‌పై అత‌డి కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే వారిని సీబీఐ అధికారులు క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.


More Telugu News