చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమాలు నిజమేనని తేల్చిన ప్రభుత్వ కమిటీ?

  • చిత్రపురి సొసైటీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు
  • రంగారెడ్డి జిల్లా అధికారిణి అనిత నేతృత్వంలో కమిటీ
  • అవకతవకలను గుర్తించిన కమిటీ
  • ఇష్టానుసారం నిధులు ఉపయోగించారని వెల్లడి
టాలీవుడ్ 24 క్రాఫ్ట్స్ కు చెందిన చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ కమిటీ విచారణ జరిపింది. రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ అనిత నేతృత్వంలో కమిటీ విచారణ నిర్వహించింది. చిత్రపురి సొసైటీలో అక్రమాలు నిజమేనని ప్రభుత్వ కమిటీ తేల్చినట్టు తెలిసింది. 24 క్రాఫ్ట్స్ తో సంబంధంలేని వారికి కూడా సొసైటీలో సభ్యత్వం ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.

ఫ్లాట్లు, రో హౌస్ ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్టుగా కమిటీ గుర్తించింది. అసలు, సినీ పరిశ్రమతో సంబంధం లేనివాళ్లకు కూడా గృహాలు కేటాయించినట్టుగా కమిటీ నిర్ధారించింది. సొసైటీ నిధులను ఇష్టానుసారం వినియోగించారని కమిటీ పేర్కొంది. ఎలాంటి పరిశీలన లేకుండా కొన్ని నిర్మాణ సంస్థలకు రూ.52 కోట్ల మేర చెల్లింపులు చేశారని వివరించింది. 2015 నవంబరు నుంచి 2020 నవంబరు వరకు పనిచేసిన పాలకమండలి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిటీ స్పష్టం చేసింది.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకోవడాన్ని వెంటనే ఆపివేయాలని, ఇప్పటికే తీసుకున్న లోన్లను వెంటనే చెల్లించాలని పేర్కొంది. ఫ్లాట్ అలాట్ మెంట్ రద్దయిన వారి డబ్బులు వెంటనే చెల్లించాలని తెలిపింది.


More Telugu News