కర్నూలు జిల్లా జి.సింగవరంలో చేపట్టిన గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు

  • కర్నూలు జిల్లా జి.సింగవరంలో గ్రామ సచివాలయ నిర్మాణం
  • ఊరికి దూరంగా సచివాలయం నిర్మిస్తుండటంపై హైకోర్టును ఆశ్రయించిన సర్పంచ్
  • సర్పంచ్ కు పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం
కర్నూలు జిల్లా జి.సింగవరంలో చేపట్టిన గ్రామ సచివాలయం నిర్మాణంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... జి.సింగవరం నీటిపారుదల శాఖ స్థలంలో సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణంపై గ్రామ సర్పంచ్ నాగేంద్ర హైకోర్టును ఆశ్రయించారు.

సచివాలయాన్ని గ్రామంలో నిర్మించాలని కోరినా... ఊరికి దూరంగా సచివాలయం కట్టడంపై తన పిటిషన్ లో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు... భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్ కు రూ. 9 లక్షలు చెల్లించాలంటూ తనకు పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సర్పంచ్ కి పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు నిలిపివేసింది. మరోవైపు సర్పంచ్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టులో వాదిస్తూ... తన క్లయింట్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారని, దీంతో అధికార పార్టీ సభ్యులు ఆయనను వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు.


More Telugu News