పెగాస‌స్ క‌ల‌క‌లంపై విచార‌ణ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీజేఐ జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ‌

  • విచార‌ణ స‌మ‌యంలో స‌మాంత‌ర చ‌ర్చ‌లు దుర‌దృష్ట‌క‌రం
  • విచార‌ణ‌ల‌పై విశ్వాసం, న‌మ్మ‌కం ఉండాలి
  • పిటిష‌నర్లు చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాలు అఫిడ‌విట్ రూపంలో స‌మ‌ర్పించాలి
  • సామాజిక మాధ్య‌మాల‌తో పాటు బ‌య‌ట జ‌రిగే చ‌ర్చ‌ల‌కు ప‌రిధి ఉండాలి  
పెగాస‌స్ క‌ల‌క‌లంపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. విచార‌ణ‌లో భాగంగా సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విచార‌ణ స‌మ‌యంలో స‌మాంత‌ర చ‌ర్చ‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. న్యాయ‌స్థానాలు జ‌రిపే విచార‌ణ‌ల‌పై విశ్వాసం, న‌మ్మ‌కం ఉండాల‌ని వ్యాఖ్యానించారు.

న్యాయ‌స్థానాల హాళ్ల‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కేసులో వాద‌, ప్ర‌తివాదులు స‌మాచార‌ప‌రంగా స‌హ‌క‌రిస్తార‌ని ఆశిస్తున్నామ‌ని, పిటిష‌నర్లు చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాలు అఫిడ‌విట్ రూపంలో స‌మ‌ర్పించాల‌ని అన్నారు.

అంతేగాక‌, సామాజిక మాధ్య‌మాల‌తో పాటు బ‌య‌ట జ‌రిగే చ‌ర్చ‌ల‌కు ప‌రిధి ఉండాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా, ఫైల్ చేసిన పిటిష‌న్ల‌న్నీ త‌మ‌కు అందాయ‌ని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ‌తా తెలిపారు. ప్ర‌భుత్వం నుంచి సూచ‌న‌లు రావాల్సి ఉన్నందున స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు.

దీంతో పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. కాగా, ఈ పిటిష‌న్ల‌పై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్ , జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే.

మరోపక్క, పార్లమెంటులో పెగాస‌స్ అంశం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ, న్యాయ, జర్నలిస్టులు సహా అనేక‌ మంది ప్రముఖుల వ్య‌వ‌హారాల‌పై టెక్నాల‌జీ ద్వారా నిఘా పెట్టిన‌ట్లు తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది.


More Telugu News