రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆదిలాబాద్ ఎస్పీ.. కేసులు పెడతామని హెచ్చరిక

  • సభకు రాకుండా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారన్న రేవంత్‌రెడ్డి
  • ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న ఎస్పీ రాజేశ్‌చంద్ర
  • మూడు రోజులపాటు అన్ని విధాలుగా సహకరించామన్న ఎస్పీ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిన్న నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభకు హాజరు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.

 కాంగ్రెస్ సభ కోసం జిల్లా పోలీసులు మూడు రోజులుగా బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించారని అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. సభకు పదివేల మంది మాత్రమే హాజరవుతారని అనుమతి పొందారని పేర్కొన్నారు. అంతకుమించి తరలించినా ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


More Telugu News