అథ్లెట్లకు వీడియో కాల్స్ చేసింది చాలు.. పాత నజరానాలు చెల్లించండి: రాహుల్ చురకలు

  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు
  • అథ్లెట్లకు ప్రధాని మోదీ వీడియో కాల్
  • పాత బకాయిలే ఇంకా ఇవ్వలేదన్న రాహుల్
  • శుభాకాంక్షలతో కలిపి ఇచ్చేయాలని హితవు
టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్స్ మాట్లాడడం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అథ్లెట్లపై కానుకల వర్షం కురిపించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనాత్మకంగా స్పందించారు. టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచినవారిలో కొందరికి 2018 ఆసియా క్రీడల నాటి నజరానాలే ఇంకా అందలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అథ్లెట్లు పతకాలు గెలవగానే వారితో వీడియో కాల్స్ మాట్లాడేందుకు తహతహలాడే నేతలు, వారికి శుభాకాంక్షలు తెలుపడం కంటే పాత బకాయిలు చెల్లించడం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.

"శుభాకాంక్షలతో పాటు అథ్లెట్ల పాత బకాయిలు కూడా ఇచ్చేయండి. క్రీడల బడ్జెట్లలో కోతలు విధించడం సరికాదు. వీడియో కాల్స్ చేయడం ఇక ఆపండి... తక్షణమే వారికి ఇవ్వాల్సిన నజరానాలు ఇచ్చేయండి" అని స్పష్టం చేశారు.  టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఓ కథనం ఆధారంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఒలింపియన్లు తమ కానుకల కోసం నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నారు అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెలువరించింది.

కాగా, అథ్లెట్లకు నజరానాలు ప్రకటించిన రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, రాహుల్ నిశిత విమర్శ చేశారు.


More Telugu News