జంతర్ మంతర్ వద్ద ముస్లిం వ్యతిరేక నినాదాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ!

  • నిన్న మార్చ్ నిర్వహించిన అశ్వని ఉపాధ్యాయ్
  • భారత్ లో ఉండాలనుకునే వారు జైశ్రీరామ్ అనాల్సిందేనని నినాదాలు
  • నినాదాలు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని ఒవైసీ విమర్శలు
ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ వద్ద ముస్లిం వ్యతిరేక నినాదాలు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిన్న జరిగిన ఓ మార్చ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే అక్కడ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ఈ మార్చ్ ను సుప్రీంకోర్టు న్యాయవాది, ఢిల్లీ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అశ్వని ఉపాధ్యాయ్ చేపట్టారు.

మరోవైపు దీనిపై అశ్వని స్పందిస్తూ, వీడియో గురించి తనకు తెలియదని చెప్పారు. ఐదారు మంది మాత్రమే నినాదాలు చేశారని... అయితే ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని అన్నారు. అయితే... 'రామ్.. రామ్'తో పాటు ముస్లింలను ద్వేషించే విధంగా ఉన్న నినాదాలు కూడా వీడియోలో వినిపిస్తున్నాయి. భారత్ లో ఉండాలనుకుంటే జైశ్రీరామ్ అనాల్సిందేనని వారు నినదించారు.

ఈ వీడియో వివాదాస్పదం కావడంతో... పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. రెచ్చగొట్టే నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ప్రాంతం ప్రధాని మోదీ నివాసానికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉందని అన్నారు. తమకు మోదీ ప్రభుత్వం అండగా ఉందనే ధైర్యంతోనే ఇలాంటి విద్వేష చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.


More Telugu News