తను జేఈఈ మెయిన్​ టాపర్​.. ఐఐటీలో మాత్రం చదవడట!

  • వంద పర్సంటైల్ సాధించిన అన్మోల్
  • పరిశోధనలంటే ఇష్టమని వెల్లడి
  • బెంగళూరు ఐఐఎస్సీనే లక్ష్యమని కామెంట్
ఐఐటీ.. చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కల ఇది. అందులో సీటొస్తే జీవితమే మారిపోతుంది మరి. అలాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీటు కోసం కొన్ని లక్షల మంది పోటీ పడుతుంటారు. సీటొస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు? కానీ, ఈ ఏడాది జేఈఈ మెయిన్ లో 100 పర్సంటైల్ సాధించి టాపర్ గా నిలిచిన విద్యార్థి మాత్రం తాను ఐఐటీలో చేరబోనని షాకిచ్చాడు. గత శుక్రవారం విడుదలైన జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాల్లో 17 మందికి 100 పర్సంటైల్ వస్తే.. హర్యానాకు చెందిన అన్మోల్ అరిక్వాల్ టాపర్ గా నిలిచాడు.

అయితే, తన లక్ష్యాల గురించి మీడియా ప్రశ్నించగా.. తనకు ఇంజనీరింగ్ ఇష్టం లేదని, ఐఐటీలో చేరబోనని అన్మోల్ చెప్పాడు. తనకు పరిశోధనలంటే అమితాసక్తి అని వివరించాడు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)లో అర్హత సాధించడమే ప్రస్తుతం తన లక్ష్యమని, అందులో గణితంలో బీఎస్సీ చేస్తానని చెప్పాడు. జేఈఈ మెయిన్ పరీక్ష పదే పదే వాయిదా పడడం చాలా చిరాకు తెప్పించిందన్నాడు. తన ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదని, అందుకు తాను చాలా అదృష్టవంతుడినని చెప్పుకొచ్చాడు.

అయితే, ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండడంతో తనకు తానుగా ఓ గదిలోనే ఐసోలేట్ అయిపోయానని, పట్టుదలతో గంటలకొద్దీ చదివి సాధించానని చెప్పాడు. 100 పర్సంటైల్ సాధించినా.. అసంతృప్తిగానే ఉందన్నాడు. 300కు 300 మార్కులు రాకపోవడం మాత్రం బాధించిందన్నాడు. కాగా, అన్మోల్ తండ్రి అడ్వొకేట్ కాగా.. తల్లి సంస్కృత అధ్యాపకురాలు.


More Telugu News