యూరప్ లో విచిత్రమైన పరిస్థితి... మొన్న వరదలు, నేడు కార్చిచ్చు!

  • ఇటీవల పలు దేశాల్లో వరదలు
  • తాజాగా గ్రీస్ లో ఆరని అగ్నిజ్వాలలు
  • 56 వేల హెక్టార్లలో వ్యాపించిన మంటలు
  • పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
ఇటీవల యూరప్ ఖండంలోని జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. కుంభవృష్టి వర్షాలు కురియడంతో నదులు, వాగులు వంకలు పొంగిపోర్లాయి. దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, తీవ్ర ఆస్తినష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలతో అతలాకుతలమైన ఆ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, యూరప్ లో మరోవైపున కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది.
గ్రీస్ లో అనేక ప్రాంతాలను చుట్టుముట్టిన దావానలం, మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఏథెన్స్ తదితర ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గత కొన్నివారాలుగా గ్రీస్ లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క గ్రీస్ లోనే గత 10 రోజుల్లో 56,655 హెక్టార్ల మేర అగ్నిజ్వాలలు వ్యాపించాయి.

ఇటీవల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో కార్చిచ్చు మరికొంత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం గ్రీస్ లో 1,450 మంది అగ్నిమాపక సిబ్బంది విమానాల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


More Telugu News