సినీ గేయ ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వ‌రుడు కావ‌లెను సినిమా
  • 'దిగు దిగు దిగు నాగ' అంటూ పాట‌
  • హిందువుల మనోభావాలు దెబ్బ‌తిన్నాయంటూ విమ‌ర్శ‌లు
  • బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు  
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా 'వరుడు కావలెను' సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవ‌లే విడుద‌లైన  'దిగు దిగు దిగు నాగ' అనే పాటపై వివాదం రాజుకుంది. నాగరాజు, నాగ‌దేవ‌త‌ను కొలుస్తూ భ‌క్తులు పాడుకునే పాట 'దిగు దిగు దిగు నాగ'ను ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వాడారంటూ కొంద‌రు మండిప‌డుతున్నారు.

ఈ సినిమాలో ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, 'దిగు దిగు దిగు నాగ'  పాటకు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ వ‌స్తున్నాయి. ఈ పాట విడుద‌లైన ఐదు గంటల్లోనే మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయంటూ ఇటీవ‌ల అనంత శ్రీ‌రామ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయ‌డంతో ఆయ‌న‌పై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు.


           


More Telugu News