టోక్యోలో చరిత్ర లిఖితమైంది... నీరజ్ చోప్రా స్వర్ణ సంచలనంపై ప్రధాని మోదీ స్పందన

  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం
  • జావెలిన్ త్రోలో పసిడి నెగ్గిన నీరజ్ చోప్రా
  • మార్మోగుతున్న చోప్రా పేరు
  • హర్యానా యువకిశోరంపై అభినందనల వెల్లువ
పట్టుమని పాతికేళ్లు కూడా లేవు... కానీ ఒలింపిక్ అథ్లెటిక్ క్రీడాంశాల్లో భారత్ కు పసిడి కరవు తీర్చాడు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ప్రపంచ దిగ్గజ జావెలిన్ త్రోయర్ల సరసన నిలుస్తూ టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం అందించాడు. దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు నీరజ్ చోప్రా పేరు మార్మోగిపోతోంది. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్స్ లో చోప్రా విసిరిన 87.58 మీటర్ల గోల్డెన్ త్రో మీడియాను, సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ హర్యానా యువ అథ్లెట్ సంచలన ప్రదర్శన పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

నీరజ్ చోప్రా తిరుగులేని విజయం సాధించాడని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొనియాడారు. "నువ్వు విసిరిన జావెలిన్ హద్దును బద్దలు కొడుతూ దూసుకుపోయి చరిత్ర సృష్టించింది. తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటూ దేశానికి ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో మొదటి బంగారు పతకం అందించావు. నీ ప్రదర్శన దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భారత్ ఉప్పొంగిపోతోంది. హృదయపూర్వక అభినందనలు" అంటూ తన సంతోషాన్ని చాటారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ, ఎంతటి అద్భుతమైన ఘటన అని ఆనందం వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా దేశానికి వన్నె తెచ్చాడని కితాబునిచ్చారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో స్వర్ణం లేక సుదీర్ఘకాలం భారత్ అలమటిస్తోందని, ఇప్పుడా నిరీక్షణకు నీరజ్ చోప్రా తెరదించాడని వెంకయ్య కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా చోప్రా సంచలన ప్రదర్శన పట్ల ట్విట్టర్ వేదికగా తన హర్షం వ్యక్తం చేశారు. టోక్యోలో చరిత్ర లిఖితమైందని తెలిపారు. "ఇవాళ నీరజ్ చోప్రా ఏదైతే సాధించాడో అది ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కుర్రవాడైన నీరజ్ చోప్రా నిజంగానే అదరగొట్టాడు. ఆట పట్ల తపన, తిరుగులేని దృఢసంకల్పం చూపించాడు. స్వర్ణం సాధించిన అతడికి శుభాభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News