కరోనా నుంచి కోలుకున్న ఏడు నెలల తర్వాత కూడా స్థిరంగా యాంటీబాడీలు!

  • బార్సిలోనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
  • కొందరిలో యాంటీబాడీల పెరుగుదల
  • సాధారణ జలుబును లక్ష్యంగా చేసుకునే యాంటీబాడీలతోనూ కొవిడ్ నుంచి రక్షణ
కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇది శుభవార్తే. ఇలాంటి వారిలో  ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో ఇవి పెరిగినట్టు కూడా గుర్తించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

గతేడాది మార్చి నుంచి అక్టోబరు మధ్య 578 మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది నుంచి నాలుగు వేర్వేరు సమయాల్లో రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. కరోనాలోని ఆరు భిన్న భాగాలపై పనిచేసే ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల స్థాయిని అంచనా వేశారు. కరోనాలోని న్యూక్లియోక్యాప్సిడ్‌ను లక్ష్యంగా చేసుకునే ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా మిగతా వన్నీ ఏడు నెలలపాటు శరీరంలో స్థిరంగా కొనసాగుతున్నట్టు గుర్తించారు. సాధారణ జలుబును లక్ష్యంగా చేసుకునే యాంటీబాడీలు కలిగి ఉన్న వారికి కొవిడ్ నుంచి రక్షణ లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరించారు.


More Telugu News