క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కారు
- పోలవరం నిర్వాసితులకు అదనంగా ప్యాకేజి
- అసైన్డ్ భూముల చట్ట సవరణకు ఆమోదం
- పలు కార్యాలయాలు కర్నూలు తరలింపు
- నవరత్నాలపైనా చర్చ
ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, పోలవరం నిర్వాసితుల అంశం, నేత కార్మికులకు ఆర్థికసాయం, జగనన్న స్వచ్ఛ సంకల్పం, నవరత్నాల పథకాలపై ఈ సమావేశంలో చర్చించారు. అంతేకాదు, పలు నిర్ణయాలకు క్యాబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు.
ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు...
ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు...
- పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి ఆమోదం. అందుకోసం రూ.550 కోట్ల కేటాయింపు.
- 1977 నాటి ఏపీ అసైన్డ్ భూముల చట్ట సవరణకు ఆమోదం.
- అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం.
- అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్ధీకరణకు ఆమోదం.
- రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులు.
- దగదర్తి (నెల్లూరు జిల్లా) ఎయిర్ పోర్టు పీపీపీ విధానంలో నిర్మాణానికి ఆమోదం.
- ఈ నెల 13న వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాల ప్రదానం.
- గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఇకపై కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీగా మార్పు.
- రాజమండ్రి పట్టణాభివృద్ధికి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు.
- ఏపీలోని లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కార్యాలయాలు, హైదరాబాదులోని లోకాయుక్త కార్యాలయం కర్నూలుకు తరలింపు.
- మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్ డీపీఆర్ లకు క్యాబినెట్ ఆమోదం.
- ధార్మిక పరిషత్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు.
- రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు ఈ నెల 24న చెల్లింపులు.
- వైఎస్సార్ నేతన్న నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం.