ఝార్ఖండ్​ జడ్జి హత్య కేసు: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

  • జడ్జిలకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదు
  • చేసినా పోలీసులు, సీబీఐ పట్టించుకోవట్లేదు
  • నిఘా సంస్థలు న్యాయవ్యవస్థకు సహకరించట్లేదు
  • ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే
  • పూర్తి బాధ్యతతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నా
ఝార్ఖండ్ జడ్జి హత్య కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుకూల తీర్పు రాకుంటే న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని, అది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

జడ్జిలకు కనీసం ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదని, ఒకవేళ ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించడం లేదని, అసలు తమను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ఇంటెలిజెన్స్ బ్యూరో (నిఘా సంస్థ), సీబీఐ సహకరించడం లేదన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత తనదేనన్నారు.

ధన్ బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈరోజు విచారణ చేపట్టింది. ఇప్పటిదాకా దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన వద్ద ఉందన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతాల్లోని జడ్జిలకు, వారి నివాస సముదాయాలకు పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించారు. జడ్జిల రక్షణకు సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయని, మిగతా రాష్ట్రాలూ త్వరగా సమర్పించాలని ఆయన సూచించారు. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు.


More Telugu News