నాగబాబు అల్లుడు చైత‌న్య‌పై పోలీసుల‌కు అపార్ట్ మెంట్ వాసుల ఫిర్యాదు

  • ఫిల్మ్‌నగర్ స‌మీపంలో ఇల్లు అద్దెకు తీసుకున్న నిహారిక‌, చైత‌న్య‌
  • గుంపులుగా కొంద‌రు వ‌స్తున్నారంటూ అపార్ట్ మెంట్ వాసుల ఫిర్యాదు
  • అపార్ట్‌మెంట్‌ వాసుల వల్ల త‌మ‌కూ ఇబ్బందులు కలుగుతున్నాయని చైత‌న్య కూడా ఫిర్యాదు
సినీ న‌టుడు నాగ‌బాబు అల్లుడు, నిహారిక‌ భర్త చైత‌న్యపై హైదరాబాద్‌, బంజారా హిల్స్ పోలీసులకు అపార్ట్ మెంటు వాసులు ఫిర్యాదు చేశారు. ఫిల్మ్‌నగర్‌ నుంచి షేక్‌పేట్‌కు వెళ్లే దారిలో ఓ అపార్ట్‌మెంట్‌లో నిహారిక దంపతులు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తమ వృత్తిపరమైన అవ‌స‌రాలకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఈ ఫ్లాట్ తీసుకున్నారు. అయితే, క‌రోనా స‌మ‌యంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ వారు త‌మకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చైతన్యపై అపార్ట్‌మెంట్‌ వాసులు గ‌త అర్ధ‌రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెసిడెన్షియల్‌ సొసైటీలో వాణిజ్య పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభ్యంత‌రాలు తెలిపారు. కొంద‌రు గుంపులుగా ఫ్లాట్‌లోకి వస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని చెప్పారు. మరోపక్క, అపార్ట్ మెంట్ వాసుల‌పై చైత‌న్య కూడా ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్‌ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నాడు. ఇరు వర్గాల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News