ఈ వైఖరి ఏంటో యావత్ తెలంగాణకూ అర్థం కావడంలేదు: విజయశాంతి

  • వాసాలమర్రిలో తాజాగా సీఎం కేసీఆర్ పర్యటన
  • ఇటీవలే ఈ గ్రామంలో పర్యటించిన వైనం
  • విమర్శనాస్త్రాలు సంధించిన విజయశాంతి
  • దత్తత తీసుకున్న గ్రామాలకేనా సీఎం? అంటూ వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామ పర్యటన నేపథ్యంలో ఆమె విరుచుకుపడ్డారు.  తెలంగాణ ఉద్యమంలో అమరులైన వందలాది కుటుంబాలను కలిసేందుకు ఈ ఏడేళ్లలో సీఎంకు ఒక్క రోజు కూడా దొరకదు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న వేలాది రైతులు, నిరుద్యోగుల కుటుంబాలను చూసేందుకు ఒక్క రోజు కూడా దొరకదని విమర్శించారు.

కానీ ఏవో రెండు, మూడు గ్రామాలను దత్తత తీసుకున్నానని చెబుతూ సీఎం కేసీఆర్ నెలకు రెండు, మూడు సార్లు వెళ్లిన చోటికే మళ్లీ మళ్లీ వెళుతున్నారని ఆరోపించారు. ఈ వైఖరి ఏంటో యావత్ తెలంగాణకూ అర్థం కావడంలేదని, ఈ సీఎం గారు జ్ఞాపకశక్తి కోల్పోయి మళ్లీ మళ్లీ పర్యటనలు చేస్తున్నారా? అంటూ విజయశాంతి సందేహం వెలిబుచ్చారు. లేకపోతే, హుజూరాబాద్ ఎన్నికల దృష్ట్యా గత హామీలను అమలు చేస్తానని నమ్మించడానికి, కొత్త మోసాల హామీలతో ఓటర్లను బోల్తా కొట్టించడానికి ఈ పర్యటనలు చేస్తున్నారా? అంటూ వ్యాఖ్యానించారు.

అసలు, ఒక సీఎం 3 గ్రామాలు దత్తత తీసుకున్నారంటే, రాష్ట్రంలోని మిగతా గ్రామాలతో తనకు సంబంధం లేదని, తను వాటి బాధ్యత తీసుకోవడంలేదని చెప్పడం కాదా? అని విజయశాంతి నిలదీశారు. తాను ఓ మూడు గ్రామాలకే పరిమితం అనేలా సీఎం వ్యవహరిస్తుండడం విపరీత చర్య అని పేర్కొన్నారు.

అయినా ఈ సీఎం దోచుకున్న లక్ష కోట్లు బయటికి తీస్తే తెలంగాణలో ఒక్కో ఉమ్మడి జిల్లాకు కనీసం 200 గ్రామాలు దత్తత తీసుకోవచ్చని, తెలంగాణలో సగం దళిత బంధు నిధులు ఇప్పటికిప్పుడే ఇవ్వొచ్చని విజయశాంతి వివరించారు.


More Telugu News