ఏపీలో నూతన విద్యావిధానంపై సీఎం జగన్ సమీక్ష... వివరాలు ఇవిగో!

  • కొత్త విద్యావిధానంలో 6 రకాలుగా పాఠశాలలు
  • పీపీ-1 నుంచి 12వ తరగతి బోధన
  • అదనంగా 14 వేల పాఠశాలలు అవసరమన్న అధికారులు
  • అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం
ఏపీలో నూతన విద్యావిధానంపై సీఎం జగన్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త విద్యావిధానంలో 6 రకాలుగా పాఠశాలలను వర్గీకరణ చేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు 6 రకాలుగా వర్గీకరణ ఉంటుందని వివరించారు. వర్గీకరణతో 14 వేల పాఠశాలలు అదనంగా అవసరమని అధికారులు ఈ సందర్భంగా సీఎం జగన్ కు తెలియజేశారు. అంతేగాకుండా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ల అంశంపైనా అధికారులు ప్రతిపాదనలు చేశారు.

అనంతరం సీఎం జగన్ స్పందిస్తూ, కొత్త వర్గీకరణకు తగినట్టుగా టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు. వర్గీకరణతో ఏపీ విద్యార్థులు ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకుంటారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. వర్గీకరణ వల్ల ఉపాధ్యాయుల పనిభారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అర్హతలున్న అంగన్ వాడీ టీచర్ల పదోన్నతులకు అవకాశం ఉంటుందని వివరించారు. నూతన విద్యావిధానంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధించాలని ఆదేశించారు. కొత్త విద్యావిధానం, నాడు-నేడుకు రూ.16 వేల కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. కొత్త విద్యావిధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.


More Telugu News