టీడీపీ నాయకురాలు జ్యోతిశ్రీ అరెస్ట్.. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

  • ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు
  • రెండు కులాలను రెచ్చగొట్టారంటూ అప్పిరెడ్డి ఫిర్యాదు
  • రాత్రంతా సీఐడీ కార్యాలయంలోనే జ్యోతిశ్రీ
సోషల్ మీడియాలో రెండు గ్రూపులను రెచ్చగొట్టే విధంగా పోస్టు పెట్టారనే కారణంతో టీడీపీ నాయకురాలు జ్యోతిశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టారంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు సీఐడీ రీజనల్ కార్యాలయానికి దర్యాప్తు నిమిత్తం తరలించారు. అయితే ఆమెను విచారించి సాయంత్రానికి విడుదల చేస్తారని అందరూ భావించారు.

అయితే సాయంత్రం 6 గంటలు దాటినా ఆమెను విడుదల చేయకపోవడంతో... టీడీపీ నేతలు సీఐడీ కార్యాలయానికి చేరుకుని వివరాలు అడిగారు. ఆమెపై సెక్షన్ 153ఏ, 120 రెడ్ విత్ 505(2) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం ఆమెను కోర్టులో ప్రవేశ పెడుతున్నట్టు చెప్పారు. జ్యోతిశ్రీతో మాట్లాడాలని టీడీపీ నేతలు కోరగా... పోలీసులు అనుమతించారు.

ఈ సందర్భంగా జ్యోతిశ్రీ మాట్లాడుతూ, గంటలో పంపిస్తామని తీసుకొచ్చి ఇక్కడే నిర్బంధించారని అన్నారు. పార్టీ పరంగానే తాను పోస్టులు పెట్టానని, ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ఒక మహిళను రాత్రి పూట సీఐడీ కార్యాలయంలో ఉంచడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


More Telugu News