చైనాలోని వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం

చైనాలోని వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం
  • వుహాన్ లో పెరుగుతున్న కరోనా కేసులు
  • 1.1 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
  • ఇప్పటి వరకు చైనాలో 93,193 కేసుల నమోదు
కరోనాకు పుట్టినిల్లయిన చైనా మరోసారి అదే మహమ్మారికి వణుకుతోంది. మొదట్లో ఈ వైరస్ పుట్టిందని భావిస్తున్న వుహాన్ నగరంలోనే ఇప్పుడు వైరస్ కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. దీంతో ఆ నగరంలోని 1.1 కోట్ల జనాభాకు కరోనా పరీక్షలను నిర్వహించాలని ఆ దేశం నిర్ణయించింది. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కరోనా వెలుగులోకి వచ్చిన వెంటనే వుహాన్ లో కఠిన ఆంక్షలను అమలు చేశారు. దీంతో, అక్కడ వైరస్ అదుపులోకి వచ్చింది. ఏడాదిన్నర తర్వాత అక్కడ ఏడు కేసులు బయటపడ్డాయి. వలస కార్మికుల్లో ఆ కేసులను గుర్తించారు. తాజాగా దేశీయంగా 61 మందికి కరోనా సోకింది.

ప్రస్తుతం చైనాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. దీంతో, దాదాపు అన్ని నగరాల్లో ఆంక్షలను మళ్లీ కఠినతరం చేశారు. ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని ఆంక్షలు విధించారు. ప్రభుత్వం రవాణా సదుపాయాలను తగ్గించింది. ఇదే సమయంలో కరోనా పరీక్షలను కూడా పెద్ద స్థాయిలో నిర్వహిస్తోంది. చైనాలో ఇప్పటి వరకు 93,193 కేసులు నమోదు కాగా... 4,636 మంది మృతి చెందారు.


More Telugu News