వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్ర‌ధాన నిందితుడిని గోవాలో అదుపులోకి తీసుకున్న‌ సీబీఐ

  • ప్ర‌ధాన నిందితుడిగా సునీల్ యాద‌వ్
  • కుటుంబంతో క‌లిసి గోవాకు పారిపోయిన వైనం
  • సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి గుర్తించిన సీబీఐ
  • కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇప్ప‌టికే అనేక మందిని ప్ర‌శ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీల‌క అంశం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సునీల్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకుముందు సునీల్ యాద‌వ్ ఈ కేసు విచార‌ణ‌లో పాల్గొన్నాడు. విచార‌ణ‌కు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది. అయితే, ఆయ‌న త‌న కుటుంబంతో క‌లిసి ఇటీవల కన‌ప‌డ‌కుండా పోవ‌డంతో, సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన సీబీఐ అధికారులు అతను గోవాలో ఉన్నాడ‌ని గుర్తించి, నిన్న అక్క‌డే అదుపులోకి తీసుకున్నారు.

ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం, కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌క్రియ‌పై అధికారులు ప్రస్తుతం అన్ని అంశాల‌ను ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐ వ‌ర్గాలు జాతీయ మీడియాకు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వివేకానంద హ‌త్య కేసులో విచార‌ణ జ‌రుపుతోన్న సీబీఐ అధికారుల‌కు ప‌లు ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయి. వాటి ఆధారంగా ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సునీల్ యాద‌వ్ అని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. సునీల్ యాద‌వ్ త‌న కుటుంబంతో క‌లిసి గోవా‌కు పారిపోక‌ముందు ప‌లు సార్లు సీబీఐ అధికారులు ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు.

2019, మార్చి 15న వివేకానంద రెడ్డి పులివెందులలోని త‌న నివాసంలోనే హ‌త్య‌కు గుర‌య్యారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇంట్లో ఒంట‌రిగా ఉన్నారు. అప్పుడు వివేకానంద రెడ్డిని క‌లిసిన వారిని, కారు డ్రైవ‌రును, మ‌రికొంత మందిని ఇప్ప‌టికే సీబీఐ అధికారులు ప్ర‌శ్నించి కీల‌క వివ‌రాలు రాబ‌ట్టారు. వివేకానంద హ‌త్య జ‌రిగిన రెండేళ్ల త‌ర్వాత ప్ర‌ధాన నిందితుడిని సీబీఐ తొలిసారి అదుపులోకి తీసుకుంది.


More Telugu News