కృష్ణా జలాల వివాదం: కేసీఆర్ పై విరుచుకుపడిన సజ్జల, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం
  • ఏపీ వాళ్లు దాదాగిరీ చేస్తున్నారన్న సీఎం కేసీఆర్
  • ఎవరిది దాదాగిరీయో అందరికీ తెలుసన్న సజ్జల
  • ఏపీ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్న విష్ణు
కృష్ణా జలాల అంశంలో కేంద్రం వైఖరిని ఆధారంగా చేసుకుని ఏపీ తమపై దాదాగిరీ చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం ఏపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యల పట్ల భగ్గుమన్నారు.

సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దాదాగిరీ చేస్తోంది ఎవరంటూ ప్రశ్నించారు. నదీ జలాల విషయంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో, దాదాగిరీ చేస్తోంది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. కేంద్ర జలశక్తి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా, ఎగువన ఉన్నామన్న భావనతో జల వివాదం తీసుకువచ్చారని మండిపడ్డారు.

జలవిద్యుత్ అంటూ 30 టీఎంసీల నీటిని సముద్రం పాల్జేశారని, సాగు అవసరాలను పట్టించుకోకుండా, విద్యుదుత్పత్తి కోసం నీటిని ఉపయోగించరాదన్న నిబంధనలను కూడా తెలంగాణ ప్రభుత్వం అతిక్రమించిందని ఆరోపించారు. ఏపీ నీటి వాటాను రక్షించుకునేందుకు మాత్రమే సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు.

అటు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మరింత ఘాటుగా స్పందించారు. అసలు, జల వివాదాన్ని సృష్టించింది ఎవరంటూ నిలదీశారు. కృష్ణా జలాలు సముద్రం పాలు కావడానికి కారణం ఎవరు? అంతర్రాష్ట్ర నీటి యుద్ధానికి ఆజ్యం పోసింది ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. "నీ రాజకీయ స్వార్థం కోసం ఏపీపై లేనిపోని ఆరోపణలు చేయడం కట్టిపెట్టు. కేసీఆర్... నీ రాజకీయ డ్రామాలను ఆపి, ముందు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పు" అని విష్ణు డిమాండ్ చేశారు.


More Telugu News