హక్కుల పోరాట యోధురాలు జయశ్రీ హఠాన్మరణం కలచివేసింది: పవన్ కల్యాణ్

  • గుండెపోటుతో మరణించిన జయశ్రీ
  • ఢిల్లీ వెళుతుండగా హైదరాబాదులో కన్నుమూత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
మానవ హక్కుల వేదిక నేత, ప్రముఖ న్యాయవాది కాకుమాను జయశ్రీ గుండెపోటుతో మరణించడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జయశ్రీ హఠాన్మరణం చెందడం తనను కలచివేసిందని తెలిపారు. ఆ హక్కుల పోరాట యోధురాలికి తన తరఫున, జనసేన తరఫున నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. జయశ్రీ సేవా గుణాన్ని అణగారిన వర్గాలు సదా స్మరించుకుంటూనే ఉంటాయని పేర్కొన్నారు.

ఫ్యాక్షన్ ప్రభావం అధికంగా ఉండే కడప జిల్లా ప్రొద్దుటూరు వంటి ప్రాంతంలో పేదల పక్షాన పోరాడుతున్నారంటే ఆమె ఎంత దృఢచిత్తం గల వ్యక్తో అర్థం చేసుకోవచ్చని వివరించారు. కడప జిల్లా వేముల గ్రామంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గళమెత్తారని కొనియాడారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై జనసేన పార్టీ హైదరాబాదులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జయశ్రీ కూడా పాల్గొన్నారని, గిరిజనుల ఆవేదన, ఆగ్రహాన్ని ఆమె తెలియజేశారని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా, సమాచార హక్కు చట్టం ఉద్యమకారిణిగా అనేక అక్రమాలు బట్టబయలు చేశారని కీర్తించారు.

ఇప్పుడు గిరిజనుల హక్కుల కోసం సుప్రీంకోర్టులో పిల్ వేసి, విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళుతుండగా ఆమె గుండెపోటుకు గురై హైదరాబాదులో కన్నుమూయడం బాధాకరమని పేర్కొన్నారు. జయశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. 


More Telugu News