సింధుకు థార్ వాహనం ఇంతకుముందే ఇచ్చాను: నెటిజన్ కు ఆనంద్ మహీంద్రా జవాబు

  • టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు కాంస్యం
  • థార్ వాహనం ఇవ్వాలన్న నెటిజన్
  • స్పందించిన ఆనంద్ మహీంద్రా
  • ఆమె గ్యారేజిలో ఇప్పటికే థార్ ఉందని వెల్లడి
  • రియో ఒలింపిక్స్ లో సింధుకు రజతం
  • అప్పుడే థార్ బహూకరించిన ఆనంద్
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కాంస్యం గెలిచిన తెలుగుతేజం పీవీ సింధుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సింధు జపాన్ నుంచి రేపు భారత్ కు రానుంది. ఆమెకు అపూర్వ స్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇక అసలు విషయానికొస్తే... ఓ నెటిజన్ సింధుకు మహీంద్రా థార్ వాహనం కానుకగా ఇవ్వాలంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను కోరాడు. థార్ వాహనం పొందేందుకు ఆమె అర్హురాలు అంటూ వడేవాలా అనే ఆ నెటిజన్ పేర్కొన్నాడు.

అందుకు ఆనంద్ మహీంద్రా బదులిస్తూ... ఇప్పటికే సింధు గ్యారేజిలో ఓ థార్ వాహనం ఉందని తెలిపారు. గతంలోనే తాను సింధుకు, సాక్షి మాలిక్ లకు థార్ వాహనం బహూకరించానని వెల్లడించారు. అంతేకాదు, సింధు, సాక్షి మాలిక్ థార్ వాహనంలో ఊరేగింపుగా వస్తున్న ఫొటోను కూడా పంచుకున్నారు.

2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో సింధు బ్యాడ్మింటన్ లో రజతం సాధించగా, హర్యానా అమ్మాయి సాక్షి మాలిక్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో కాంస్యం సాధించింది. దాంతో వారిద్దరికీ ఆనంద్ మహీంద్రా థార్ వాహనాలు ఇచ్చారు.


More Telugu News