ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు.. రాజీనామా చేస్తానంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన

  • నియోజకవర్గ అభివృద్ది కోసం రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారన్న రాజాసింగ్
  • నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 10 లక్షల వంతున ఇవ్వాలని డిమాండ్
  • కేసీఆర్ నిధులను ఇచ్చిన వెంటనే.. రాజీనామా లేఖను స్పీకర్ కు అందిస్తానని వ్యాఖ్య
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. గోషామహల్ అభివృద్ది కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తన నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని... వారి కోరిక మేరకు రాజీనామా చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసిన వెంటనే... అసెంబ్లీ స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందిస్తానని తెలిపారు.

ఉపఎన్నిక వస్తే కానీ బడుగులు, రైతులపై కేసీఆర్ కు ప్రేమ రావడం లేదని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిధులను విడుదల చేసిన వెంటనే స్పీకర్ కు తన రాజీనామా లేఖ ఇస్తానని చెప్పారు.

హూజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వబోతున్నామని చెప్పారు. అయితే పైలట్ ప్రాజెక్టు కింద తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో, మిగిలిన నియోజవర్గ ఎమ్మెల్యేలపై కూడా రాజీనామాలు చేయాలనే ఒత్తిళ్లు వస్తున్నాయి.


More Telugu News