ఒలింపిక్స్ లో చ‌రిత్ర సృష్టించిన భార‌త అమ్మాయిల‌ హాకీ జ‌ట్టు.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన వైనం!

  • నేటి మ్యాచ్‌లో విజ‌యం
  • మూడుసార్లు ఒలింపిక్స్ ఛాంపియ‌న్ గా నిలిచిన ఆసీస్‌పై గెలుపు
  • 1980 తర్వాత అంత‌టి అద్భుత గెలుపు  
టోక్యో ఒలింపిక్స్ లో భార‌త అమ్మాయిల‌ హాకీ జట్టు చ‌రిత్ర సృష్టించింది. ఈ రోజు జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌కు వెళ్లిన భార‌త జ‌ట్టుగా నిలిచింది. ఈ రోజు జ‌రిగిన‌ క్వార్టర్ ఫైనల్లో గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉన్న‌ ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టుతో తలపడ్డారు. రెండో క్వార్ట‌ర్‌లో భార‌త జ‌ట్టులోని గుర్జీత్ కౌర్ 22వ నిమిషం వ‌ద్ద గోల్ చేసింది. అంతేగాకుండా ఒక్క గోల్ కూడా చేయ‌నివ్వ‌కుండా ఆసీస్‌ను భార‌త్ నిలువ‌రించింది.

ఆసీస్‌ను ఓడించ‌డం ద్వారా సెమీస్ లోకి అడుగుపెట్టారు. మూడుసార్లు ఒలింపిక్స్ ఛాంపియ‌న్ గా నిలిచిన ఆసీస్‌ను ఓడించడం మామూలు విష‌యం కాదు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆసీస్‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా భార‌త్ ఆడింది. ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టుపై 1-0 తేడాతో భార‌త్ గెలిచింది. 1980 తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్ లో మ‌ళ్లీ అంత‌టి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వడం ఇదే తొలిసారి. 1980లో మాస్కోలో జ‌రిగిన ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 4వ స్థానంలో నిలిచింది.


More Telugu News