టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ గొప్ప మనసు.. చదువుకున్న స్కూలుకు రూ. 18 లక్షలతో భవన నిర్మాణం

  • రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌తో కలిసి భవనాన్ని ప్రారంభించిన సుకుమార్ దంపతులు
  • మట్టపర్రు గ్రామాభివృద్ధికి ముందుంటానని స్పష్టీకరణ
  • తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ జ్ఞాపకాలు నెమరువేసుకున్న సుకుమార్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. చిన్నప్పుడు తాను చదువుకున్న తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో తన తండ్రి తిరుపతినాయుడు పేరుతో రూ. 18 లక్షలతో భవనం నిర్మించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌తో కలిసి సుకుమార్ దంపతులు నిన్న ఈ భవనాన్ని ప్రారంభించారు.

 అనంతరం సుకుమార్ మాట్లాడుతూ.. మట్టపర్రు గ్రామాభివృద్ధికి తానెప్పుడూ ముందుంటానని అన్నారు. తన తండ్రి పేరుతో స్కూలు భవనం నిర్మించి, ప్రారంభించిన క్షణాలు మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.  సుకుమార్ ఆ పాఠశాలలో చదువుకున్నప్పటి రికార్డును ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఫ్రేమ్ కట్టించి సుకుమార్‌కు అందజేశారు. తాను దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ సెప్టెంబరులో తిరిగి ప్రారంభమవుతుందని సుకుమార్ తెలిపారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని చెప్పారు.


More Telugu News