మోదుగులింగాయపాలెంలో రోడ్డును తవ్వేసి 100 టిప్పర్ల కంకర తరలింపు..అమరావతి దళిత జేఏసీ మండిపాటు!

  • పది రోజుల క్రితం ఉద్దండరాయునిపాలెంలో రోడ్డు తవ్వకం
  • అర్ధరాత్రి జేసీబీలతో తవ్వేసి కంకర తరలింపు
  • రాజధానిని నామరూపాల్లేకుండా చేస్తున్నారంటూ మండిపడిన అమరావతి దళిత జేఏసీ
అమరావతిలో రోడ్ల తవ్వకం కొనసాగుతోంది. పది రోజుల క్రితం ఉద్దండరాయునిపాలెంలో రోడ్డును తవ్వేసి కంకరను తరలించిన ఘటనను మర్చిపోకముందే తాజాగా, మోదుగులింగాయపాలెంలో రోడ్డును తవ్వేశారు. గ్రామానికి ఉత్తరంగా ఉన్న సీడ్ యాక్సెస్ పక్కన ఉన్న రోడ్డును తవ్వేసిన గుర్తు తెలియని వ్యక్తులు కంకరను తరలించారు. నిన్ననే ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ పది రోజుల క్రితమే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

నాలుగు అడుగుల లోతు, 200 మీటర్ల పొడవున రోడ్డును తవ్వేసిన దుండగులు దాదాపు 100 టిప్పర్ల కంకరను తరలించి ఉంటారని భావిస్తున్నారు. పెద్దగా జనసంచారం ఉండని ఈ ప్రాంతంలో టిప్పర్లు, జేసీబీలు తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

రోడ్డును తవ్వేసిన విషయం తెలిసిన వెంటనే అమరావతి దళిత జేఏసీ నాయకులు, వెలగపూడి రైతులు రోడ్డు తవ్వేసిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. రోడ్లను ధ్వంసం చేస్తూ రాజధాని అమరావతి నామరూపాల్లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్ల తవ్వకం, నిర్మాణ సామగ్రి చోరీపై న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


More Telugu News