ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి.. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ

  • ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డి
  • హుజూరాబాద్‌ నుంచి బీసీని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ యోచన
  • కౌశిక్‌రెడ్డికి నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి
ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రిమండలి ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఫారసు చేసింది.

నిజానికి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆ స్థానాన్ని బీసీకి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పంపుతామని హామీ ఇచ్చారని, అందుకనే నామినేటెడ్ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో హుజూరాబాద్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ మొదలైంది. ఈ క్రమంలో టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎల్.రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు హుజూరాబాద్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News