కశ్మీర్ ప్రీమియర్ లీగ్ ను గుర్తించవద్దంటూ ఐసీసీకి లేఖ రాసిన బీసీసీఐ

  • పీవోకేలో కేపీఎల్ టోర్నీ
  • పలువురు విదేశీ ఆటగాళ్లతో టోర్నీ
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న బీసీసీఐ
  • కశ్మీర్ వివాదాస్పద ప్రాంతం అని ఐసీసీకి నివేదన
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కేపీఎల్ (కశ్మీర్ ప్రీమియర్ లీగ్) పేరిట పాకిస్థాన్ ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన క్రికెట్ టోర్నమెంట్ రాజకీయ నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీని గుర్తించవద్దంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ఐసీసీకి లేఖ రాసింది. కశ్మీర్... రెండు దేశాల నడుమ సుదీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న అంశమని బీసీసీఐ పేర్కొంది. ఇలాంటి చోట్ల నిర్వహించే టోర్నీలో పలు దేశాలకు చెందిన క్రికెటర్లు ఆడితే, ఈ ప్రాంతానికి ఒకరకంగా అంతర్జాతీయ ఆమోదం తెలిపినట్టే అవుతుందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కాగా, ఆరు ఫ్రాంచైజీలు కలిగివున్న ఈ టోర్నీ ఆగస్టు 6న ప్రారంభం కానుంది. ఇందులో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ హెర్ష్ లే గిబ్స్, లంక దిగ్గజం తిలకరత్నే దిల్షాన్, ఇంగ్లండ్ ఆటగాళ్లు మాంటీ పనేసర్, మాట్ ప్రయర్, విండీస్ ఆటగాడు టినో బెస్ట్ ఆడుతున్నారు. ఇటీవలే గిబ్స్ బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేయడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది.

కశ్మీర్ లీగ్ లో తమను ఆడవద్దంటూ బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించాడు. కేపీఎల్ లో ఆడితే భారత్ లో క్రికెట్ సంబంధ కార్యకలాపాలకు తమను అనుమతించబోమని బీసీసీఐ హెచ్చరిస్తోందని గిబ్స్ వెల్లడించాడు. కాగా, బీసీసీఐ రాసిన లేఖకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News