తెలుగుతేజం పీవీ సింధుకు అభినందనలు తెలిపిన కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్

  • టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధుకు కాంస్యం
  • సింధుపై అభినందనల వెల్లువ
  • సింధు విజయంపై హర్షం వ్యక్తం చేసిన నేతలు
  • మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కాంస్యం నెగ్గిన పీవీ సింధుపై అభినందనల జడివాన కురుస్తోంది. ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిన నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. సింధు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గడం సంతోషదాయకమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భారత్ తరఫున ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించింది సింధు ఒక్కరేనని కొనియాడారు.

ఇక ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన మన తెలుగమ్మాయి పీవీ సింధుకి శుభాకాంక్షలు, శుభాభినందనలు అంటూ తన సంతోషం వెలిబుచ్చారు.

సింధు గెలుపు నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా దేశానికి మరో పతకం అందించిందని సింధును కొనియాడారు. అప్పుడు రియోలోనూ, ఇప్పుడు టోక్యోలోనూ భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిందని తెలిపారు. ఒలింపిక్స్ వేదికపై సింధు పోరాట పటిమకు క్రీడాభిమానులు మురిసిపోతున్నారని వెల్లడించారు. ఇవాళ్టి మ్యాచ్ లో విజయం కోసం సింధు పోరాడిన తీరు, బ్యాడ్మింటన్ లో ఆమె ఎదిగిన విధానం యువతకు స్ఫూర్తిదాయకం అని పవన్ అభిప్రాయపడ్డారు.

క్రీడారంగంలో సింధు విజయాలు సాధించేలా తీర్చిదిద్దారంటూ ఆమె తల్లిదండ్రులు విజయ, పీవీ రమణలకు, కోచ్ లకు అభినందనలు తెలిపారు. సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.


More Telugu News