అక్రమ మైనింగ్ కు వైఎస్ బీజం వేస్తే, జగన్ పెంచి పోషిస్తున్నారు: పట్టాభి

  • ఏపీలో రగులుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారం
  • టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం
  • టీడీపీ నేత పట్టాభి ప్రెస్ మీట్
  • అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చారని వెల్లడి
కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మీడియా సమావేశం నిర్వహించారు. కొండపల్లి అక్రమ మైనింగ్ పై వైసీపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. విలువైన సహజవనరులను దోపిడీ చేయడం వైసీపీ నైజం అని విమర్శించారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్నది యథార్థమని స్పష్టం చేశారు. మైలవరం వీరప్పన్ వసంత కృష్ణప్రసాద్ మైనింగ్ అక్రమాలకు సూత్రధారి అని వెల్లడించారు.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్రమ మైనింగ్ కు నాంది పలికారని, ఆయన తనయుడు జగన్ అధికారంలోకి వచ్చి దాన్ని మరింత పెంచి పోషిస్తున్నారని పట్టాభి విమర్శించారు. వైఎస్ హయాంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, సర్వే నెంబరు 143ని సృష్టించి, దానికింద అక్రమ మైనింగ్ కోసం 216.25 ఎకరాలను కేటాయించారని వివరించారు. అయితే, రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబరు 143 అని ఇంకు పెన్నుతో రాసి సృష్టించారని 2016 నాటి హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైందని పట్టాభి తెలిపారు.

ఈ నేపథ్యంలో, 2017లో చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ లీజులను రద్దు చేసిందని వెల్లడించారు. అయితే, జగన్ ప్రభుత్వం వచ్చాక అక్కడ అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చారని ఆరోపించారు. దీనిపై అధికారపక్ష నేతలు ఏంచెబుతారని పట్టాభి ప్రశ్నించారు.


More Telugu News