ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి భారత్ అధ్యక్షత.. ఫ్రాన్స్​ కు కృతజ్ఞతలు!

  • ఈ నెల మొత్తం భారత్ దే అధికారం
  • మూడు ముఖ్యమైన అంశాలపై చర్చ
  • భారతీయులందరికీ గర్వ కారణమన్న రాయబారి
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఈ మేరకు ఇవాళ ఆ బాధ్యతలను చేపట్టింది. ఆగస్టు నెల మొత్తం భద్రతా మండలి.. భారత్ అధ్యక్షతనే నడుస్తుందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్. తిరుమూర్తి వెల్లడించారు. భద్రతా మండలిలో మాట్లాడిన ఆయన ఆ వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్ ఎజెండాలోని కీలకమైన అంశాలపై చర్చించనున్నారు.

కాగా, జులైలో అధ్యక్షత వహించిన ఫ్రాన్స్ కు అంబాసిడర్ తిరుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. తన అధ్యక్షతలో భాగంగా మూడు అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్టు తిరుమూర్తి ప్రకటించారు. తీరప్రాంత రక్షణ, శాంతి ప్రతిష్ఠాపన, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలను చర్చిస్తామన్నారు. శాంతి పరిరక్షకులను గుర్తుంచుకోవడంలో భాగంగా ఓ స్మారక కార్యక్రమాన్నీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

సిరియా, ఇరాక్, సోమాలియా, యెమెన్ తదితర దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ శాంతి, భద్రతలను మరింత పటిష్ఠ పరిచేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన విషయమన్నారు. కాగా, భారత్ కు అవకాశం దక్కినందుకు ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనాయిన్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లోనూ భారత్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు.


More Telugu News