హెచ్‌1బీ వీసాలు అంద‌ని భార‌త టెకీల‌కు శుభ‌వార్త‌.. మ‌రోసారి అమెరికా లాట‌రీ

  • విదేశీ వృత్తి నిపుణుల‌కు అమెరికా హెచ్‌1బీ వీసాలు
  • లాట‌రీ పద్ధ‌తిలో ఇప్ప‌టికే ముగిసిన వీసాల జారీ ప్ర‌క్రియ‌
  • అమెరికాలో వృత్తి నిపుణుల కొర‌త‌
  • రెండోసారి లాట‌రీ ప్ర‌క్రియ చేపట్టిన అమెరికా
అమెరికా ప్ర‌తి ఏడాది విదేశీ వృత్తి నిపుణుల‌కు ఇచ్చే  హెచ్‌1బీ వీసాల జారీ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ముగిసింది. లాట‌రీ పద్ధ‌తిలో ఈ వీసాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, అమెరికాలో వృత్తి నిపుణుల కొర‌త ఇంకా ఉండ‌డంతో అరుదుగా ఇచ్చే రెండో లాటరీ ద్వారా మరింత మందికి వీసాలు మంజూరు చేయనుంది.

తొలిసారి చేప‌ట్టిన‌ లాటరీలో కావాల్సిన‌న్ని వీసాలు మంజూరు చేయలేకపోయామని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్ తెలిపింది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు మ‌రోసారి లాటరీ చేపడుతున్నట్లు చెప్పింది. ఇప్ప‌టికే ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్ల ఆధారంగా వృత్తినిపుణుల‌ను ఎంపిక చేశామ‌ని, దాని ఆధారంగా పిటిషన్ల ఫైలింగ్ ఆగస్టు 2న ప్రారంభమ‌వుతుందని తెలిపింది.

ఈ ప్ర‌క్రియ న‌వంబ‌రు 3న ముగుస్తుందని, వృత్తి నిపుణులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వీరంతా హెచ్‌1బీ దరఖాస్తు పూర్తి చేయాలని సూచించింది. కాగా, ఈ వీసాల జారీ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో అర్హ‌త ఉన్న వారిని, అమెరికాకు అవ‌స‌రం ఉన్న వారిని మొదటి లాటరీలో ఎంపిక చేశారు.

ఇప్పుడు రెండో లాటరీ ద్వారా వీసాలు మంజూరు చేస్తుండడంతో భారత్ ఐటీ నిపుణులకు పెద్ద ఎత్తున లాభం చేకూర‌నుంది. అమెరికాకు భార‌త్‌, చైనా నుంచే అత్య‌ధిక మంది వృత్తి నిపుణులు వెళ్తుంటారు. అమెరికాలోని ఐటీ సంస్థ‌లు వేలాది మందిని హెచ్‌1బీ వీసాల ద్వారానే విదేశాల నుంచి ర‌ప్పించుకుంటాయి.


More Telugu News