టీమిండియాతో టెస్టు సిరీస్ ముందు ఇంగ్లండ్ జట్టులో ఊహించని పరిణామం

  • ఆటకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన స్టోక్స్
  • అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడి
  • ఆగస్టు మొదటి వారం నుంచి భారత్ తో టెస్టు సిరీస్
  • ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్ స్థానంలో క్రెగ్ ఒవర్టన్
టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించన పరిణామం ఎదురైంది. అనేక సిరీస్ లలో ఇంగ్లండ్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కొన్నాళ్లు ఆటకు విరామం పలకాలని నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ ఆడకూడదని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది.

తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎడమచేతి చూపుడు వేలుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడంపైనా దృష్టి సారించేందుకు ఈ విరామాన్ని ఉపయోగించుకోవాలని స్టోక్స్ భావిస్తున్నాడని ఈసీబీ పేర్కొంది. స్టోక్స్ నిర్ణయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు బోర్డు వెల్లడించింది. తన మనోభావాలను నిర్భయంగా వెల్లడించాడని, తాము అతడికి అండగా నిలుస్తామని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తెలిపారు.

ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. సుదీర్ఘమైన ఈ సిరీస్ లో స్టోక్స్ వంటి ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ సేవలు కోల్పోవడం ఇంగ్లండ్ జట్టుకు పెద్ద లోటు అని చెప్పాలి. కాగా, స్టోక్స్ స్థానాన్ని సోమర్సెట్ ఆల్ రౌండర్ క్రెగ్ ఒవర్టన్ తో భర్తీ చేయనున్నారు.


More Telugu News