ఊహించని పరిణామం.. ఒకే చోట కలిసిన ఉద్ధవ్ థాకరే, ఫడ్నవిస్!

  • కొల్హాపూర్ వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన థాకరే, ఫడ్నవిస్
  • ఇద్దరం ప్రజల కోసమే పని చేస్తున్నామన్న థాకరే
  • తమ కలయికలో రాజకీయం లేదని వ్యాఖ్య
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఈరోజు ఒకే చోట కలుసుకున్నారు. భారీ వర్షాల వల్ల కొల్హాపూర్ లో నీట మునిగిన ప్రాంతాల్లో వీరు పర్యటించారు. ఈ సందర్భంగా వరదల వల్ల సంభవించిన నష్టం, పునరావాస చర్యలపై వీరు చర్చించారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ఫడ్నవిస్ ఇక్కడే ఉన్నారనే విషయం తనకు తెలుసని... అందుకే తాను కూడా వస్తున్నా, ఉండమని ఆయనకు చెప్పానని తెలిపారు. తామిద్దరం ప్రజల కోసమే పని చేస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయని, ఫడ్నవిస్ నాలుగో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు.

వరదలపై ముంబైలో తాము సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని... ఆ మీటింగ్ కు మిమ్మల్ని కూడా పిలుస్తామని ఫడ్నవిస్ కు చెప్పానని అన్నారు. ఆ తర్వాత మీడియాతో ఫడ్నవిస్ మాట్లాడుతూ, వరద పునరావాసానికి సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికపై థాకరేతో చర్చించానని చెప్పారు. వరద బాధితులకు తక్షణ పునరావసం గురించి చర్చించామని తెలిపారు.


More Telugu News