సవరించిన పోలవరం అంచనాలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

  • రూ. 47,725 కోట్ల అంచనాలకు కేంద్ర జలశక్తి మంత్రి అంగీకారం
  • వచ్చే వారం కేంద్ర కేబినెట్ ముందుకు సవరించిన అంచనాల అంశం
  • రూ. 1,920 కోట్లను రీయింబర్స్ చేస్తామని చెప్పారన్న విజయసాయి
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన రూ. 47,725 కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలుపుతామని జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వైసీపీ ఎంపీలకు తెలిపారు. రేపు ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపనున్నారు. అనంతరం వచ్చే వారం కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన అంచనాల అంశం రానుంది.

ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, టెక్నికల్ కమిటీ ఆమోదించిన రూ. 47,725 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదిస్తామని షెకావత్ చెప్పారని అన్నారు. బిల్లుల విషయంలో కాలయాపన లేకుండా ఎస్క్రో ఖాతా తెరవాలని కోరామని చెప్పారు.

అయితే ఖాతాను తెరవడం సాధ్యం కాదని... వారం, పది రోజుల్లో డబ్బును రీయింబర్స్ చేస్తామని తెలిపారని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 1,920 కోట్లను రీయింబర్స్ చేస్తామని, రూ. 47,725 కోట్లను కేబినెట్ ద్వారా ఆమోదించేందుకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని రాజమండ్రికి తరలించాలనే విన్నపానికి కూడా షెకావత్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.


More Telugu News