రెడ్​ లిస్ట్​ లోని దేశాలకు వెళితే.. మూడేళ్ల నిషేధం: ప్రజలకు సౌదీ హెచ్చరిక

  • ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించొద్దని సూచన
  • చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్
  • కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తప్పవని కామెంట్
రెడ్ లిస్ట్ లో ఉన్న దేశాలకు వెళ్లకూడదని తమ దేశ ప్రజలకు సౌదీ అరేబియా మరోసారి తేల్చి చెప్పింది. కాదని ఎవరైనా వెళితే మూడేళ్ల పాటు వారిపై ప్రయాణ నిషేధం విధిస్తామని హెచ్చరించింది. కరోనా కేసులు, డెల్టా వేరియంట్ ముప్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అధికారుల అనుమతి లేకుండానే మే నెలలో కొందరు రెడ్ లిస్ట్ దేశాలకు వెళ్లారని, తద్వారా ట్రావెల్ నిబంధనలను ఉల్లంఘించారని దేశ అంతర్గత శాఖ అధికారి ఒకరు చెప్పారు.

మరోసారి ఎవరైనా ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బ్రెజిల్, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్థాన్, అర్జెంటీనా, ఇథియోపియా, ఇండోనేసియా, లెబనాన్, టర్కీ, వియత్నాం, భారత్ లను సౌదీ రెడ్ లిస్ట్ లో పెట్టింది. నేరుగా గానీ లేదా వేరే దేశాల ద్వారా గానీ రెడ్ లిస్ట్ లోని దేశాలకు వెళ్లరాదని ప్రజలకు తేల్చి చెప్పింది. కరోనా కట్టడిలోకి రావాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొంది.


More Telugu News