దేవినేని ఉమ వాహనంపై రాళ్లదాడి... చంద్రబాబు పరామర్శ

  • కొండపల్లి ప్రాంతంలో మైనింగ్
  • అక్రమ మైనింగ్ అంటూ ఉమ ఆరోపణలు
  • మైనింగ్ పరిశీలించి వస్తుండగా దాడి
  • కారు అద్దాలు ధ్వంసం
  • వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత
కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ తీరుతెన్నులను పరిశీలించి వస్తున్న ఉమ వాహనాన్ని గడ్డ మణుగ గ్రామం వద్ద వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వాహనాన్ని చుట్టుముట్టిన కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఉమ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఈ ఘటనపై దేవినేని ఉమ తీవ్రంగా స్పందించారు. తనపై దాడి చేసిన వాళ్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులని ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... ఉమకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దాడులతో భయపడేదిలేదని స్పష్టం చేశారు. వైసీపీపై తమ పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు.

కాగా, ఈ ఘటన నేపథ్యంలో, భద్రత కల్పించడంలో పోలీసుల విఫలం అయ్యారని దేవినేని ఉమ విమర్శలు చేశారు. ఈ క్రమంలో జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.


More Telugu News