ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది పరిమితిని దాటి రూ.4 వేల కోట్ల అప్పులు చేసింది: కేంద్రం వెల్లడి

  • రాజ్యసభలో ప్రశ్నించిన టీడీపీ సభ్యుడు కనకమేడల
  • స్పందించిన ఆర్థిక శాఖ సహాయమంత్రి
  • లిఖితపూర్వక సమాధానం
  • 2020-21లో ఏపీకి రుణ అవకాశం కల్పించినట్టు వెల్లడి
ఏపీ సర్కారు ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోందని, పరిమితికి మించి అప్పులు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండడం తెలిసిందే. విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చుతూ కేంద్రం ఏపీ అప్పులపై వాస్తవాలు వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఏపీ అప్పులపై కేంద్రాన్ని ప్రశ్నించగా, కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా స్పందించారు. ఏపీ సర్కారు ఈ ఏడాది పరిమితిని దాటుతూ రూ.4 వేల కోట్ల మేర అప్పులు చేసిందని పంకజ్ చౌదరి వెల్లడించారు.

15వ ఆర్థిక సంఘం అనుమతి ఇవ్వడంతో 2020-21 సంవత్సరానికి రూ.30,305 కోట్లు, కరోనా కట్టడికి రూ.19,192 కోట్లు అప్పు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్టు వివరించారు.

కాగా, లోక్ సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఊహించని సమాధానం ఎదురైంది. దిశ చట్టం గురించి ఆయన కేంద్రాన్ని ప్రశ్నించగా, ఏపీ ప్రభుత్వం నుంచే ఎలాంటి స్పందన రావడంలేదని కేంద్రం తరఫున హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం దిశ బిల్లును తమకు పంపగా, తాము కొన్ని అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి, వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరామని ఆయన వెల్లడించారు. అయితే, ఇంతవరకు ఆ అభ్యంతరాలపై ఏపీ సర్కారు నుంచి తమకు వివరణ అందలేదని స్పష్టం చేశారు.


More Telugu News