ఇతర పార్టీల సర్పంచ్ లకు గౌరవం కూడా ఇవ్వడం లేదు: అచ్చెన్నాయుడు

  • ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు గెలిచిన చోట కూడా వైసీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు
  • గౌరవ ప్రదంగా వ్యవహరించకపోతే ప్రజాకోర్టులో మొట్టికాయలు తప్పవు
  • ఎంతో మంది అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు
ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లకు వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారికి గౌరవం ఇవ్వాల్సిందేనని... అయితే వైసీపీ నేతలు చెప్పినట్టు వ్యవహరిస్తూ ప్రొటోకాల్ పాటించకపోవడం సరికాదని చెప్పారు.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలిచిన చోట కూడా వైసీపీ నేతలే పెత్తనం చెలాయించడం దారుణమని అన్నారు. దేశానికి రాష్ట్రపతి ఎలాగో గ్రామానికి సర్పంచ్ అంతేనని... అలాంటి సర్పంచుల విషయంలో వైసీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన ప్రజాప్రతినిధులతో గౌరవప్రదంగా వ్యవహరించకపోతే ప్రజా కోర్టులో మొట్టికాయలు తప్పవని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ అరాచకాలను, అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు చెప్పారనే కారణంతో ఎంతో మంది అర్హులను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కోర్టులతో మొట్టికాయలు వేయించుకుంటున్నారని అన్నారు. వైసీపీ నేతలందరికీ జగన్ మాదిరే కోర్టులతో చివాట్లు తప్పవని అన్నారు.


More Telugu News