కరోనా సోకితే వచ్చే రక్షణ కన్నా.. వ్యాక్సిన్​ తీసుకుంటే వచ్చే ప్రతిరక్షకాల రక్షణే ఎక్కువ: తాజా అధ్యయనంలో వెల్లడి

  • లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ స్టడీ
  • 2 వేల మంది వైద్య సిబ్బంది రక్త నమూనాల పరిశీలన
  • కరోనా సోకాక వచ్చే యాంటీబాడీల కాలపరిమితి 4 నెలలే
కరోనా సోకితే వచ్చే ప్రతిరక్షకాల రక్షణ కన్నా.. వ్యాక్సిన్ వేసుకుంటే వచ్చే ప్రతిరక్షకాల రక్షణే ఎక్కువకాలం పాటు ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ వైద్యులు చేసిన అధ్యయనంలో.. టీకాతోనే వైరస్ నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుందని స్పష్టమైంది.

కరోనా సోకిన తర్వాత శరీరంలో పుట్టే ప్రతిరక్షకాలు కేవలం 3 నుంచి 4 నెలలే ఉంటాయని, ఆ తర్వాత కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో అంతకన్నా ఎక్కువ కాలం పాటు యాంటీబాడీలుంటాయని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న 2 వేల మంది ఆరోగ్య సిబ్బంది రక్త నమూనాలను నెలన్నరపాటు పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు.

మరో మూడు నెలల పాటు వారి రక్త నమూనాలను పరిశీలిస్తామని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలోని బ్లడ్ అండ్ ట్రాన్స్ ఫ్యూషన్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ తులికా చంద్ర చెప్పారు. మొదటి డోసు తీసుకున్న వారిలో ఉత్పత్తయిన ప్రతిరక్షకాలు.. కరోనా సోకిన వాళ్లలో వచ్చిన యాంటీబాడీలతో సమానంగా ఉన్నట్టు గుర్తించారు.

అధ్యయనం తేల్చిన అంశాలివీ..

  • 90 శాతం మంది ఆరోగ్య సిబ్బందిలో కరోనా యాంటీబాడీలున్నాయి. 68 శాతం మంది సిబ్బంది రెండు డోసులు తీసుకోగా.. 11 శాతం మంది ఒక డోసు తీసుకున్నారు.
  • వ్యాక్సిన్ తీసుకోని 11 శాతం మందిలోనూ యాంటీబాడీలు.
  • రెండో డోసులు తీసుకున్న ఐదు శాతం మందిలో కనిపించని ప్రతిరక్షకాలు.
  • మొదటి డోసు తీసుకున్న వారిలో 2 శాతం మందికి ఉత్పత్తి కాని యాంటీ బాడీలు.
  • రెండు డోసులు తీసుకున్న వారిలో 41 శాతం మంది సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడలేదు.
  • రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 26 శాతం మందికి సెకండ్ వేవ్ లో కరోనా.


More Telugu News