ఎన్నికల అనంతర హింస మీద హెచ్చార్సీ నివేదికపై మమత సర్కార్​ మండిపాటు

  • కలకత్తా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు
  • నింద వేసేందుకు ముందే నిర్ణయించారని కామెంట్
  • కమిటీలోని వారంతా కేంద్రానికి సన్నిహితులని ఆరోపణ
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) ఇచ్చిన ఎన్నికల అనంతర హింస నివేదికపై బెంగాల్ లోని మమత సర్కార్ మండిపడింది. ఇవాళ కలకత్తా హైకోర్టులో దానిపై అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఎన్ హెచ్చార్సీ ఆరోపణలన్నింటినీ ప్రభుత్వం తోసిపుచ్చింది. కమిటీలోని సభ్యులందరికీ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించింది.

అందుకే బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందని పేర్కొంది. బీజేపీ నేత ఆతిఫ్ రషీద్ ను ఉద్దేశపూర్వకంగా ఎన్ హెచ్చార్సీ ప్యానెల్ లో నియమించారని, బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చేందుకు ముందే సిద్ధమయ్యారని ఆరోపించింది. కమిటీ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొంది.

ఎంతో మంది పోలీసు బలగాలు, ఉన్నతాధికారుల పేరు ప్రతిష్ఠలను ఎన్ హెచ్చార్సీ నివేదిక నాశనం చేసిందని మండిపడింది. వారి వాదనలు వినకుండా ఎన్నో ఆరోపణలు చేసి మానవ హక్కుల రక్షణ చట్టం నిబంధనలను తుంగలో తొక్కిందని అసహనం వ్యక్తం చేసింది. కొందరు తృణమూల్ కాంగ్రెస్ నేతలను అత్యంత హేయమైన నేరస్థుల జాబితాలో చేర్చిందని ఆక్షేపించింది. కాబట్టి ఇలాంటి నివేదికను కోర్టు అంగీకరించరాదని విజ్ఞప్తి చేసింది.


More Telugu News