ప్రశాంత్ కిశోర్ ఐ-ప్యాక్ సభ్యుల్ని గృహ నిర్బంధం చేసిన త్రిపుర పోలీసులు

  • వారం నుంచి త్రిపురలో మకాం వేసిన ఐ-ప్యాక్ సభ్యులు
  • వారి కదలికలు అనుమానంగా వున్నాయన్న పోలీసులు
  • ప్రజాస్వామ్యంపై దాడేనన్న టీఎంసీ
త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న రాజకీయ అవకాశాలను అంచనా వేసేందుకు వారం రోజుల క్రితం రాజధాని అగర్తలకు వచ్చి, ఓ హోటల్‌లో బస చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఐ-ప్యాక్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మంది సభ్యులున్న ఈ బృందం వివిధ చోట్ల పర్యటిస్తూ సర్వే చేస్తోంది. అయితే, వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని నిర్బంధించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అందరూ హోటల్ రూములోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించినట్టు పశ్చిమ త్రిపుర ఎస్పీ మాణిక్ దాస్ తెలిపారు.

మరోపక్క, ఐ-ప్యాక్ సభ్యుల్ని నిర్బంధించిన విషయం తెలిసిన టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి తప్ప మరోటి కాదని మండిపడింది. ఇది బీజేపీ పనేనని ఆరోపించింది. రాష్ట్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజలు విసిగిపోయారని, అందుకనే తమకు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొంది. వారు తమకు మద్దతుగా నిలుస్తుండడం చూసి తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిష్‌లాల్ సింఘా ఆరోపించారు.


More Telugu News