2014 నాటి అంచనాల వ్యయమే భరిస్తాం: పోలవరంపై విజయసాయి ప్రశ్నకు కేంద్రం జవాబు

  • పోలవరంపై రాజ్యసభలో ప్రశ్నించిన విజయసాయి
  • లిఖితపూర్వకంగా బదులిచ్చిన షెకావత్
  • అంచనా వ్యయం పెరిగిందని వెల్లడి
  • అదనపు పనులకు నిధులు ఇవ్వబోమని స్పష్టీకరణ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. విజయసాయి ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జవాబిచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల అంచనాలు ఏ మేరకు ఉన్నాయో, అంత మొత్తాన్ని మాత్రమే తాము భరిస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున షెకావత్ స్పష్టం చేశారు.

పోలవరం హెడ్ వర్క్స్ డిజైన్ల మార్పు కారణంగా వ్యయం రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోందని వివరించారు. కాఫర్ డ్యాం, స్పిల్ వే కాంక్రీట్ పనులు, డయాఫ్రం వాల్ పనులు, చిప్పింగ్ తదితర పనులు అదనంగా చేపట్టినట్టు ఏపీ సర్కారు తెలిపిందని వెల్లడించారు.

గోదావరి ట్రైబ్యునల్ కు లోబడి ప్రాజెక్టు డిజైన్లు ఉండాలని, ఆ డిజైన్లను సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) ఆమోదించిన తర్వాతే అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ కొన్ని మార్పులకు ఆమోదం తెలిపిన పిమ్మట పోలవరం వద్ద అదనపు పనులు చేపట్టారని తెలిపారు. అయితే వీటికి కేంద్రం నుంచి అదనపు నిధులు కేటాయించబోవడంలేదని షెకావత్ స్పష్టం చేశారు.


More Telugu News