గౌతమ్ గంభీర్ పై విచారణను ఆపే ప్రసక్తే లేదు: సుప్రీంకోర్టు

  • కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఫాబిఫ్లూ మందు పంపిణీ చేసిన గంభీర్
  • మందులను వ్యక్తిగతంగా సరఫరా చేయకూడదన్న సుప్రీంకోర్టు
  • ఇలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టీకరణ
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రజలకు మందులను పంపిణీ చేసిన కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై విచారణను ఆపబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనాకు సంబంధించిన మందులను ఏ గ్రూపు కూడా పంపిణీ చేయడాన్ని తాము అనుమతించబోమని తెలిపింది. అయితే గంభీర్ కు కొంత ఊరట కలిగించే వ్యాఖ్యలు చేసింది. తొలుత హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది. హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకు రావచ్చని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

ప్రజలు మందుల కొరతను ఎదుర్కొంటున్న సమయంలో... ఏదైనా ట్రస్టు కానీ, పౌర సమూహం కానీ ఆ మందులు పంపిణీ చేయడాన్ని తాము అనుమతించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ఏ వ్యక్తి కూడా వ్యక్తిగతంగా మందులు పంపిణీ చేయకూడదని చెప్పింది. ఇలాంటి వాటిని అనుమతిస్తే... ప్రతి ఒక్కరూ మందులను సేకరించుకుని, వారి సొంత లబ్ధి కోసం వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపింది.

'మీరు (గంభీర్) పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. నిర్దిష్టమైన పద్ధతి ప్రకారం మీరు నడుచుకోవాలి. ఏ వ్యక్తి కూడా సొంతంగా మందులు పంపిణీ చేయకూడదు. మిమ్మల్ని చూసి అందరూ మందు పంపిణీ చేసే అవకాశం ఉంది' అని జస్టిస్ షా అన్నారు. సమాజంలో ఏం జరుగుతోందనే విషయంపై తమ దృష్టి ఎప్పుడూ ఉంటుందని... ఇలాంటి వాటిని తాము అనుమతించబోమని జస్టిస్ చంద్రచూడ్  వ్యాఖ్యానించారు.  

ఏప్రిల్ నెలలో ఢిల్లీలోని తన నియోజకవర్గ పరిధిలో... ఫాబిఫ్లూ మందులను గంభీర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఆ సమయంలో ఆ డ్రగ్ కు విపరీతమైన కొరత ఉంది. ఈ నేపథ్యంలోనే గంభీర్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టులో కేసు విచారణ దశలో ఉండగానే సుప్రీంకోర్టును గంభీర్ ఆశ్రయించారు. మరోవైపు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో గంభీర్ తరపు న్యాయవాది తమ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.


More Telugu News