ఆపదలో ఉన్న యువతిని దిశ యాప్ సాయంతో రెండు నిమిషాల్లోనే రక్షించిన ఏపీ పోలీసులు

  • రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆటోలో సూళ్లూరుపేటకు
  • మార్గమధ్యంలో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్
  • దిశ యాప్ సాయంతో ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరి
  • విషయం తెలిసి మధ్యలోనే దించేసి పరారైన ఆటో డ్రైవర్
దిశ యాప్ సాయంతో నెల్లూరు పోలీసులు బాధితురాలిని రెండు నిమిషాల్లోనే రక్షించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన 25 ఏళ్ల యువతి శ్రీసిటీలో ఉద్యోగం చేస్తోంది. నాయుడుపేటలో ఉంటున్న యువతి సూళ్లూరుపేట వెళ్లేందుకు శనివారం రాత్రి 9.25 గంటలకు బస్టాండుకు వచ్చింది. అయితే, పదిన్నర గంటల వరకు వేచి చూసినా బస్సులేవీ రాకపోవడంతో ఆటోలో బయలుదేరింది. మార్గమధ్యంలో ఆటోడ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో అప్రమత్తమైన యువతి ఫోన్ ద్వారా విషయాన్ని తన సోదరికి తెలియజేసింది.

ఆమె వెంటనే దిశ యాప్ ద్వారా నెల్లూరు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు 10.40 గంటల సమయంలో బాధితురాలితో మాట్లాడారు. ఇది గమనించిన ఆటోడ్రైవర్ యువతిని మల్లాం వద్ద దించేసి పరారయ్యాడు.  మరోవైపు, కంట్రోల్ రూము నుంచి సమాచారం అందుకున్న నాయుడుపేట మొబైల్, దొరవారిసత్రం పోలీసులు రెండు నిమిషాల్లోనే అంటే 10.42 గంటలకే యువతి వద్దకు చేరుకుని రక్షించారు. అనంతరం ఆమెను సూళ్లూరుపేటలో వదిలిపెట్టారు. సకాలంలో స్పందించి యువతిని రక్షించిన పోలీసులకు డీఐజీ రివార్డులు అందజేశారు.


More Telugu News