శ్రీలంక వెన్ను విరిచిన భువీ.. గబ్బర్ సేనదే తొలి టీ20

  • నాలుగు వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్
  • లక్ష్య ఛేదనలో తడబడిన శ్రీలంక
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆతిథ్య జట్టును 38 పరుగుల తేడాతో మట్టికరిపించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ భువనేశ్వర్ దారుణంగా దెబ్బకొట్టాడు.

కీలకమైన నాలుగు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్‌ను భువీ కుప్పకూల్చాడు. ఫలితంగా ఆ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే 126 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ తీసుకుని విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక చేసిన 44 పరుగులే అత్యధికం. అవిష్క ఫెర్నాండో 26, దాసున్ శనక 16, మినోద్ భానుక 10 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేదు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధావన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధ సెంచరీతో అలరించగా, ధావన్ 46, సంజు శాంసన్ 27, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు.

వన్డే సిరీస్‌లో విఫలమైన హార్దిక్ పాండ్యా (10) మరోమారు తడబడ్డాడు. శ్రీలంక బౌలర్లలో చమీర, హసరంగ చెరో రెండు వికెట్లు తీసుకోగా, కరుణరత్నె ఒక వికెట్ పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రేపు జరుగుతుంది.


More Telugu News