వివేకా హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్టు తెలిసినా... ప్రభుత్వంలో కదలిక లేదు: వర్ల రామయ్య

  • వివేకా హత్యపై సీబీఐ విచారణ
  • మేజిస్ట్రేట్ ఎదుట వాచ్ మన్ రంగయ్య వాంగ్మూలం నమోదు
  • సంచలన విషయాలు చెప్పాడంటూ ప్రచారం
  • తీవ్రస్థాయిలో స్పందించిన వర్ల రామయ్య
  • జగన్ విఫలం అయ్యారంటూ ధ్వజం
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వాచ్ మన్ రంగయ్య తన వాంగ్మూలంలో సంచలన విషయాలు చెప్పాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు.

వివేకా హత్యకు ఇద్దరు ప్రముఖులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చినా, ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏంటని వర్ల ప్రశ్నించారు. సీఎం జగన్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత బాబాయ్ హత్యకు కుట్ర జరిగిందని తెలిసినా చర్యలు తీసుకోవడంలో సీఎం జగన్ విఫలమయ్యారని విమర్శించారు. ఇది రాజ్యాంగం ప్రకారం నడిచే ప్రభుత్వమా? కాదా? అంటూ ధ్వజమెత్తారు. హంతకులను పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదన్నారు.

"వివేకా హత్యకేసుకు సంబంధించి ఓ సాక్షి జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. సుపారీ గురించి కీలక సమాచారం అందించాడు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా కదలిక వస్తుందేమోనని రెండ్రోజులు వేచి చూశాను. కనీసం డీజీపీ అయినా ఏమైనా మాట్లాడతాడేమోనని చూస్తే స్పందనేలేదు" అని అన్నారు.


More Telugu News