మొరాయించిన పిస్టల్​.. నిష్క్రమించిన మనూ భాకర్​

  • షూటింగ్ మహిళల విభాగంలో నిరాశ
  • ఐదు నిమిషాల సమయం వృథా
  • అప్పటికే ఏకాగ్రతను కోల్పోయిన ప్రపంచ రెండో ర్యాంకర్
పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మహిళల విభాగంలో భారత్ కు నిరాశే ఎదురైంది. పిస్టల్ మొరాయించి పతకం ఆశలపై నీళ్లు జల్లింది. మనూ భాకర్ నిష్క్రమణకు కారణమైంది. సెకండ్ సిరీస్ లో ఆమె పిస్టల్ లోని డిజిటల్ ట్రిగ్గర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాన్ని సరిచేసేలోపు ఆమె ఐదు నిమిషాలను కోల్పోయింది. దీంతో ఆమె ఏకాగ్రత దెబ్బతిని ఫైనల్ అవకాశం చేజారిపోయింది.

ఫైనల్ టాప్ 8 నుంచి స్థానం దిగజారిపోయింది. మొత్తంగా ఆమె 575 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ సిరీస్ లో 98 పాయింట్లు సాధించిన ఆమె.. ఆ తర్వాత 95, 94, 95 పాయింట్లతో వెనుకబడిపోయింది. ఐదో రౌండ్ లో 98 పాయింట్లతో పుంజుకున్నప్పటికీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఫ్రాన్స్ కు చెందిన సెలీనా గోబర్ విల్ల 8వ స్థానంలో నిలిచింది. మరో షూటర్ యశస్విని 574 పాయింట్లు సాధించి 13వ స్థానంలో నిలిచింది.

క్వాలిఫికేషన్ రౌండ్ లోని రెండో సిరీస్ లో ఆమె పిస్టల్ ఎలక్ట్రానిక్ ట్రిగ్గర్ సర్క్యూట్ పనిచేయలేదని, అదే ఆమె ఓటమికి కారణమైందని మనూ తండ్రి, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారి రామకిషన్ భాకర్ చెప్పారు. ప్రపంచ రెండో ర్యాంకర్ గా ఉన్న ఆమె నిష్క్రమణ అభిమానుల మనసులను కలచివేసింది.


More Telugu News