మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఆర్నెల్ల జైలు శిక్ష

  • గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై నెగ్గిన కవిత
  • ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపణలు
  • బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
  • తుది తీర్పు వెలువరించిన ప్రజాప్రతినిధుల కోర్టు
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరమే ముగించాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితపై గతంలో నమోదైన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఈ తీర్పు వచ్చిన వెంటనే కవిత రూ.10 వేల జరిమానా చెల్లించారు. ఆపై బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

2019 పార్లమెంటు ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారంటూ మాలోత్ కవితపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ఆరంభించిన ఆమె, తండ్రి బాటలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ పార్టీ తరఫున గత లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.


More Telugu News